జగనన్న విద్యా దీవెన కింద జులై - సెప్టెంబర్ త్రైమాసికం ఫీజుల సొమ్మును నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఫీజు డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని.. 7 నుంచి 10 రోజుల్లో కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం కోరింది. మూడు వారాల్లోగా ఫీజులు చెల్లించకపోతే తదుపరి విడత నేరుగా కాలేజీలకే ఇస్తామని తెలిపింది. కాగా ఈ సారి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు ఎక్కువ. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఎప్పటికప్పుడు తల్లులు - విద్యార్థుల జాయింట్ అకౌంట్‌లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.