ఎలక్షన్స్-2024 ముందు 5 లక్షల ఇళ్ల పంపిణీ.. లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్!
నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకం కింద ఐదు లక్షల ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు అందజేయడంపై సీఎం జగన్ దృష్టి సారిస్తున్నారు.
By అంజి
ఎలక్షన్స్-2024 ముందు 5 లక్షల ఇళ్ల పంపిణీ.. లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకం కింద ఐదు లక్షల ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు అందజేయడంపై దృష్టి సారిస్తున్నారు. మొదటి విడతలో 7.50 లక్షల ఇళ్లను అప్పగించిన సీఎం జగన్ ఇప్పుడు రెండో విడతలో ఐదు లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తెలంగాణలోని ఇటీవలి ఎన్నికల ఫలితాలు, అక్కడ కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ను గద్దె దించగా, అంతకుముందు కర్ణాటకలో ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలకు 'మేక్ ఆర్ బ్రేక్' ప్రాముఖ్యతను చూపించాయి. 2024 కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేందుకు జగన్ మోహన్ రెడ్డి రకరకాల వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. పేదలందరికీ ఇల్లు మెగా గృహనిర్మాణ కార్యక్రమం ఆ దిశగానే ముందడుగు వేసింది. ఇది 30 లక్షల గృహ లబ్ధిదారులతో అనుసంధానించబడిన దాదాపు కోటి మంది ఓటర్లను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
ఇదిలా ఉండగా, 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు తన ఎన్నికల వాగ్దానాలను చాలా వరకు అమలు చేయలేదని, ఫలితంగా ఆయన గద్దె దిగారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణిని గమనించిన జగన్ మోహన్ రెడ్డి మహమ్మారి కాలంలో సహా నవరత్నాలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. రెండు దశల మెగా హౌసింగ్ ప్రోగ్రామ్‌లో ఒక్కో దశలో 16 లక్షల ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి గృహనిర్మాణ కార్యక్రమం యొక్క పురోగతి, స్థితిని తరచుగా సమీక్షిస్తున్నారు, ఇది రాబోయే రెండు నెలల్లో పూర్తయితే వైఎస్‌ఆర్‌సికి అనుకూలంగా మారనుంది.
డేటా ప్రకారం, ఐదు లక్షల ఇళ్లలో 1,15,334 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 3,84,666 పురోగతిలో ఉన్నాయి. నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అవి శరవేగంగా సాగుతున్నాయి. చాలా వరకు మహిళల పేరు మీద ఉన్న ఇళ్లు కాబట్టి వారి ఓట్లతో గెలుపొందాలంటే ఆ ఇళ్లను పూర్తి చేయడం తప్పనిసరి అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మెగా హౌసింగ్ ప్రోగ్రాం వచ్చే ఏడాది జరగనున్న 'బిగ్ బ్యాటిల్'పై భారీ ప్రభావం చూపనుంది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. కార్యక్రమం పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు లక్ష్యాన్ని చేరుకుంటామని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.