నరసాపురం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తా: సీఎం జగన్
CM YS Jagan starts development works in Narasapuram. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా
By అంజి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.3300 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. నర్సాపురం చరిత్రలో ఒకే రోజు ఇన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశానని, ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులతో నరసాపురం నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తానన్నారు.
ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. ఫిషరీస్ యూనివర్సిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయని, ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అభిప్రాయపడ్డారు. రూ.332 కోట్లతో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముమ్మిడివరంలో ఒఎన్‌జిసి పనుల వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని, చేపలు పట్టే సౌకర్యం కోల్పోయిన వారికి రెండోసారి పరిహారం అందజేస్తున్నామని నర్సాపురంలో దశాబ్దాల నాటి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపి వారి సంక్షేమమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామని, నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.