ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారు: సీఎం జగన్
CM YS Jagan speech narsipatnam public meeting. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.968 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్
By అంజి Published on 30 Dec 2022 2:13 PM ISTఅనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.968 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోలేదని, తమ హయాంలో నర్సీపట్నం రూపు రేఖలు మార్చబోతున్నామని సీఎం జగన్ అన్నారు. ఇన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎడ్యుకేషన్ పరంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
త్వరలోనే రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ రాబోతుందన్నారు. ఈ మెడికల్ కాలేజీలో 150 సీట్లు వస్తాయన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా వస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని సీఎం జగన్ అన్నారు. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తామన్నారు. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా నిత్యం సర్కార్‌పై బుదరజల్లడమే పనిగా పెట్టుకుందన్నారు. మంచి చేస్తున్నా.. దుష్టచతుష్టయంకు చెడే కనిపిస్తోందన్నారు. రూల్స్ ప్రకారం.. ప్రతి 6 నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుందని, దీనిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.
''చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పనైనా జరిగిందా?. దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. వారికి ఈ రాష్ట్రం కాకుంటే.. మరో రాష్ట్రం.. ఈ ప్రజలు కాకుంటే.. మరో ప్రజలు.. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తనవల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారు. తన ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ కూడా పెట్టలేకపోయారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు. ప్రతి వర్గాన్ని కూడా వంచించిన బాబు సభకు జనం ఎందుకొస్తారు?. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసినందుకా.. జనం వచ్చేది. రుణాలు పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారు. మన రాష్ట్రానికి రావాల్సిన హోదాను ప్యాకేజీ కోసం తాకట్టుపెట్టినందుకా?. ఫోటో షూట్, డ్రోన్ షాట్స్ కోసం జనం రాకపోయినా జనం బాగా వచ్చారని చూపించేందుకు యత్నించారు. ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారు'' అని సీఎం ధ్వజమెత్తారు.