అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు కేటాయించారు. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆస్పత్రిలో చిన్నారుల తల్లిదండ్రుల సమక్షంలో వైద్యులకు అందజేశారు. ఇటీవల సీఎం జగన్ కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించడం తెలిసిందే. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించిన సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతనుకూడా ప్రభుత్వం తీసుకుంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. అలాగే నెలకు రూ.10 వేల పెన్షన్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు రెండున్నరేళ్ల హనీ ఉంది. అయితే ఆ చిన్నారి గాకర్స్ వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి వల్ల కాలేయం పనిచేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తుండగా హనీ తల్లిదండ్రులు సీఎంను కలిశారు. హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు. ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్.. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా, ఆ బాలిక వైద్యానికి రూ.1 కోటి మంజూరు చేశారు.