జగనన్న శాశ్వత భూ హక్కు స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత: సీఎం జగన్
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష
By అంజి Published on 31 March 2023 4:15 PM ISTజగనన్న శాశ్వత భూ హక్కు స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత: సీఎం జగన్
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున సర్వే నిర్వహించడం లేదన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపరింగ్ చేయని విధంగా పత్రాలు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకం వర్తమానానికే కాకుండా భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్ధేశించిన లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. జాప్యం లేకుండా అవసరమైన సాంకేతిక పరికరాలను తీసుకురావాలని ఆదేశించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవాదాయ శాఖ పరిధిలో మొదటి దశలో చేపట్టిన 2000 గ్రామాల్లో సర్వే ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మే 20లోగా సర్వే రాళ్లు వేసే పనులతోపాటు సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వే పరికరాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయిన తర్వాత సరిహద్దుల్లో 31 లక్షల సర్వే రాళ్లను వేయడానికి సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. రోజుకు 50 వేల సర్వే రాళ్లను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. తదుపరి దశల్లో నిర్వహించే సర్వే ప్రక్రియకు రాళ్ల కొరత రాకుండా చూసుకోవాలని సీఎం సూచించారు..
మున్సిపల్ పరిధిలో సర్వే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి డేటా క్రోడీకరించబడుతోందన్నారు. నిర్ణీత గడువులోగా ఆయా ప్రాంతాల్లో సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ మూడో వారంలోగా 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేస్తామని, డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీరాజ్ అధికారులు సీఎంకు వివరించారు.