పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: సీఎం జగన్
CM YS Jagan released funds under jagananna videshi vidya deevena. జగనన్న విదేశీ విద్యా దీవెన ఆర్థికసాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం
By అంజి Published on 3 Feb 2023 3:00 PM ISTజగనన్న విదేశీ విద్యా దీవెన ఆర్థికసాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 19.95 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన 213 మంది విద్యార్థులు ఈ మొత్తాన్ని అందుకున్నారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొదటి విడత సాయంగా వర్చువల్ మోడ్‌లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని సీఎం జమ చేశారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు గరిష్టంగా రూ. 1.25 కోట్లు, ఇతరులు ప్రవేశం పొందితే రూ. కోటి మొత్తం విద్యా వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. నాణ్యమైన విద్య కోసం క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 విశ్వవిద్యాలయాలు ఎంపిక చేయబడ్డాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పేరున్న యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించేలా ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం... జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు చేస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వేదికపై దేశ, ఆంధ్ర ప్రదేశ్ కీర్తిని చాటి చెప్పాలన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో చదువుకునేందుకు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం కల్పించామన్నారు. పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అన్నారు. విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టేనని సీఎం అన్నారు.