151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతున్నాం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

By అంజి  Published on  16 May 2024 2:13 PM IST
151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతున్నాం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. గురువారం విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్.. అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. అయితే 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈ సారి సాధించబోతోందని అన్నారు.

‘‘మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్‌ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్‌ అన్నారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్‌ స్పందించారు. దేశంలో అందరూ షాక్‌ అయ్యేలా జూన్‌ 4వ తేదీన ఫలితాలు వస్తాయని జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్‌ ఎంతో సాయపడిందన్నారు. ఐప్యాక్‌ సూచనలను గత ఐదేళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు.

Next Story