కుటుంబాలను చీలుస్తున్నారు : సీఎం జగన్
కాకినాడ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 3 Jan 2024 12:58 PM GMTకాకినాడ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలతో కుటుంబాలను చీలుస్తారని.. పొత్తుల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ బిడ్డకు వాళ్ల లాగా అబద్ధాలు చెప్పడం రాదు. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వామి అన్నారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారని.. తప్పుచేస్తే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదని సీఎం జగన్ ఆరోపించారు. కానీ ఇవాళ పేదలకు ఇస్తున్న ఇళ్లపై అవినీతి అంటూ కేంద్రానికి లేఖ రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాలు ఆపాలన్నదే పవన్ కల్యాణ్ ఆలోచన అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకు కోర్టులు జైలుకు పంపాయన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్కొక్కరికీ రూ.58 వేలు పింఛన్ మాత్రమే ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.లక్షా 47 వేలు అందిస్తున్నామన్నారు. గత ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌లు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను పెంచుకుంటూ రూ.3 వేలు చేశామన్నారు. పింఛన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్లు ఇచ్చేవారని, ఇప్పుడు రూ.2 వేల కోట్లు ఇస్తున్నామన్నారు.