ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం) విజయవాడకు రానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్వచ్ఛంద సేవకులకు సెల్యూట్ చేసే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉత్తమ వాలంటీర్లను సీఎం సన్మానించనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని తమ నివాసానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నిస్వార్థంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులను వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం సన్మానించనుంది.
కనీసం ఒక సంవత్సరం పాటు వాలంటీర్‌గా పనిచేసి ఎటువంటి ఫిర్యాదులు లేని వాలంటీర్లకు ప్రభుత్వం రివార్డ్ ఇస్తుంది. ప్రతీ నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లను సేవా వజ్ర పురస్కారం, రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జీ, శాలువా, ధ్రువపత్రాలతో సత్కరిస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ నుండి ఐదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుండి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి సేవా రత్న అవార్డు, రూ.20 వేల నగదు, మెడల్, శాలువా, బ్యాడ్జీ, ధ్రువపత్రం అందజేస్తారు. 2,38,624 మందికి సేవా మిత్ర పురస్కారం, రూ.10 వేల నగదు అందజేస్తారు.