చిన్నవాడినైనా.. రాష్ట్రం కోసం ఎన్నో పనులు చేశా: సీఎం జగన్
తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 28 March 2024 6:51 AM GMTచిన్నవాడినైనా.. రాష్ట్రం కోసం ఎన్నో పనులు చేశా: సీఎం జగన్
తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్.. రెండో రోజైన గురువారం ఉదయం వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తన కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన సీఎంగా పని చేశారని, ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా? అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామన్నారు.
ఎక్కడా లంచాలు లేవని, వివక్ష లేదని అన్నారు. పాఠశాలలు బాగుపడ్డాయి, వైద్య రంగం బాగుపడిందని జగన్ అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 కాలంలో తాను బటన్‌లు నొక్కి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నానని తెలిపారు. అర్హత ఉంటే చాలూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారని సీఎం జగన్ వివరించారు.
అమ్మ ఒడి కింద ఒక్క ఎర్రగుంట్లలో 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది.. రూ. 4.69 కోట్లు అందించామని తెలిపారు. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 3 కోట్లు, ఎర్రగుంట్లలో ఆరోగ్యశ్రీ కింద రూ. 2 కోట్లకుపైగా అందించామన్నారు. ఎర్రగుంట్లలో 1,496 ఇళ్లకుగానూ 1391 ఇళ్లకు లబ్ధి చేకూరిందని, చేదోడు కింద రూ. 31.20 లక్షలు అందించామని తెలిపారు. మొత్తంగా ఎర్రగుంట్లకు ఈ 58 నెలల కాలంలో రూ. 48.74 కోట్లు అందించామని వివరించారు.