దేశంలోని ప్రతి పక్షాలను తప్పుబట్టిన సీఎం జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని విపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని
By అంజి Published on 25 May 2023 8:46 AM IST
దేశంలోని ప్రతి పక్షాలను తప్పుబట్టిన సీఎం జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని విపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధినేత వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని బుధవారం ట్వీట్‌లో విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ హాజరవుతుందని ప్రకటించారు.
“అన్ని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఈ అద్భుతమైన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తితో, ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నా పార్టీ హాజరవుతుంది” అని రాశారు. గొప్ప, గంభీరమైన, విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్నందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు. "ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంటు మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది" అని ఆయన అన్నారు.
మే 28న జరగనున్న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ప్రధాని మోదీ దీన్ని స్వయంగా ప్రారంభించి, రాష్ట్రపతి ద్రౌపదిని పూర్తిగా పక్కన పెట్టడం రాష్ట్రపతి అత్యున్నత పదవిని అవమానించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.