ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు , వైఎస్‌ఆర్ షాదీ తోఫా కింద అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని జమ చేశారు. అక్టోబరు-డిసెంబరు మధ్య వివాహం చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చామని, ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ను పూర్తి చేసి నేడు నేరుగా నగదు జమ చేస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి త్రైమాసికానికి ఇదే తరహాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, పేదల జీవితాలను మార్చే ఏకైక అంశం విద్య అని వైఎస్ జగన్ అన్నారు.
పేద కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యను అందించడానికి,బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందన్నారు. డ్రాపౌట్ రేటును తగ్గించడమే ఈ పథకం లక్ష్యమని, ఈ పథకాన్ని పొందేందుకు వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని, బాలికలు 18 ఏళ్లు, అబ్బాయిలు 21 ఏళ్లు నిండి ఈ పథకాన్ని పొందాలని ముఖ్యమంత్రి సూచించారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. బీసీల కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం రూ. 50,000 ఇవ్వగా వైసీపీ ప్రభుత్వం రూ. 75,000 ఇస్తోందన్నారు.