సీఎం జగన్ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏ
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు సీఎం జగన్ హాజరయ్యారు.
By అంజి Published on 21 Aug 2023 1:45 PM ISTసీఎం జగన్ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏ
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలలో ఒకటి దసరా కానుకగా అందిస్తామన్నారు. హెల్త్ విభాగంలో మహిళా ఉద్యోగులకూ ఐదు రోజుల క్యాజువల్ లీవ్ ఇస్తామని చెప్పారు. అన్ని రకాలుగా ఉద్యోగులకు అండగా నిలిచామని సీఎం జగన్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తమది ప్రజా ప్రభుత్వమని అన్నారు. సంక్షేమం, సేవా ఫలాలను అందించడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు అని అన్నారు. కోవిడ్ సమయంలో రెవెన్యూ తగ్గినా డీబీటీనీ అమలు చేశామని, అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది తమ ప్రభుత్వమేనని చెప్పారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టిందని, తాము ఎప్పుడూ నిజాయితీ కమిట్‌మెంట్‌తోనే అడుగులు వేశామన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, ఏ ప్రభుత్వంతో పోల్చినా తాము అంతకంటే మిన్నగా ఉన్నామన్నారు. 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. కారుణ్య నియామాకాల్లోనూ పారదర్శకత పాటించామని, నాడు - నేడుతో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా రూపొందించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాల మీద మమకారం ఉన్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు.
మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నామన్నారు. ప్రతీ చోటా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ప్రభుత్వం తమదేనన్నారు. గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించామన్నారు. ఇప్పుడు 7 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీని నియమించామని, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించిందన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను నాశనం చేసిందని, జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం జగన్ ఆరోపించారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు విదిల్చారని అన్నారు. బాబు, ఆయన వర్గానికి తన మీద కడుపు మంటగా ఉందన్నారు.