ఏపీలో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
CM Jagans sensational comments on hindu gods idols distruction.ఏపీలో కొనసాగుతున్న హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2021 9:13 AM GMT
ఏపీలో కొనసాగుతున్న హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడంటే భయం లేకుండా పోతుందని.. దేవుళ్లని కూడా రాజకీయాల్లోకి తీసుకొసున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జరుగుతున్న 'ఏపి పోలీసు డ్యూటీ మీట్' ను వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్యూటీ మీట్ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతోందన్నారు. సైబర్ టెక్నాలజీ, మహిళల రక్షణ మీద దృష్టి సారించబోతున్నారని.. పోలీసు శాఖ మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు 'ఇగ్నైట్' దోహదపడాలని తెలిపారు. పోలీస్ స్టేషనుకు వచ్చిన ప్రజల మొహాలలో చిరు నవ్వులు చూడగలుగుతున్నామా అన్నదానికి ఇగ్నైట్ మార్గం చూపాలన్నారు.
ఏపీలో ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దుండగులు మారుమూల ప్రాంతాల్లోని విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే.. ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. దేవుడి విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఎవరికి లాభమనే విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని అన్నారు. ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నారో ఆలోచించాలని చెప్పారు. టీడీపీ పార్టీ పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని.. పొలిటికల్ గెరిల్లా వార్ జరుగుతోందని చెప్పారు. ఈ కేసులను పోలీసులు సమర్థవంతంగా తేల్చాలని అన్నారు.
ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం జరిపితే పబ్లిసిటీ వస్తుందని.. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 'నాడు-నేడు' కార్యక్రమానికి పేరు వస్తోందని 2019లో దుర్గగుడి ధ్వంసం అని ప్రచారం చేశారని, వెండి సింహాలను మాయం చేశారని దుయ్యబట్టారు. దిశ పోలీస్ స్టేషన్లకు వస్తున్న మంచి పేరును అడ్డుకోవడానికి కొన్ని గుడులను ధ్వంసం చేశారని చెప్పారు. రైతు జలసిరి కార్యక్రమాన్ని మొదలు పెడితే నెల్లూరు జిల్లాలోని ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసమయిందని జగన్ మండిపడ్డారు. విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే కుట్రలకు తెరలేపారని అన్నారు. కర్నూలులో లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఘటన చోటుచేసుకుందని చెప్పారు. బీసీల కోసం చర్యలు చేపట్టినప్పుడు వీరభద్రస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు తిరుమల ఆలయ లైటింగ్ లో ఏసుక్రీస్తు శిలువ అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పారు.