వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదు : సీఎం జ‌గ‌న్‌

CM Jagan's review of power department. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు

By Medi Samrat  Published on  24 Feb 2023 11:37 AM GMT
వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదు : సీఎం జ‌గ‌న్‌

అమరావతి: వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జ‌గ‌న్‌ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేసిన‌ట్లు సీఎంకు తెలిపారు. ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామని అధికారులు వివ‌రించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని స్పష్టంచేశారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని.. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న‌ సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం స్పష్టంచేశారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని.. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించారు అధికారులు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తామ‌ని అధికారులు తెలిపారు. అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2.18లక్షలకు పైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు అధికారులు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని తెలిపారు.


Next Story