వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan's review of medical and health department. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 13 Jun 2023 5:42 PM ISTవైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని.. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలని.. అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని.. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్కుల పనితీరు ఇందులో కీలకం.. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలమన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలని.. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలని.. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదని.. 4 వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదని సీఎం అన్నారు.
సీఎం ఆదేశాల మేరకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చామన్న అధికారులు.. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని సీఎంకు అధికారులు తెలిపారు. అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించినట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్‌తో బాధపడతున్నట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. అందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పేషెంట్‌కు చికిత్స అందించడంతో పాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలని.. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతాయని..పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయని.. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.