వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాడు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి 21 రోజుల బస్సు యాత్రను ప్రారంభించారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర. నేడు కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగనున్న ప్రచార యాత్ర. సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
‘మేమంతా సిద్ధం’ పర్యటన ప్రారంభించే ముందు సీఎం జగన్ తన దివంగత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలిరోజు కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల పరిధిలోని వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల, పొట్లదుత్తి, ప్రొద్దుటూరు పట్టణంలోని గ్రామాల మీదుగా సీఎం జగన్ బస్సు ప్రయాణిస్తుంది.
ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత ప్రసంగించడంతో పాటు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాత్రి బసతో తొలిరోజు ముగుస్తుంది. పర్యటనలో భాగంగా రెండో రోజు ఉదయం 11 గంటలకు ఆళ్లగడ్డలో యర్రగుంట్లలో ప్రచారం చేయనున్నారు, సాయంత్రం 5 గంటలకు నంద్యాల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎన్నికల సంఘం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న తొలి ప్రచారం ఈ బస్సుయాత్ర.