వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. ఏప్రిల్ 28 నుంచి ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో సీఎం జగన్ పాల్గొంటారు. ఏప్రిల్ 28న ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు ఏప్రిల్ 27న వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
మార్చి 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో బస్సు యాత్రను ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీ. మేర సాగింది బస్సు యాత్ర. ఇక బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు.