ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.4 వేల చొప్పున జమ కానున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం రూ.2,204.77 కోట్ల నిధులను కేటాయించింది. ఇక మూడో విడత రూ.2,000ల సాయాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో చెల్లించే అవకాశం ఉంది. కాగా రైతు భరోసా-పీఎం కిసాన్ కింద 70 శాతం రైతులకు ఎంతో మేలు జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్–నవంబర్ నెల ముగిసే లోపే ఖరీఫ్ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున సాయం అందిస్తోంది. తాజాగా జమ చేయనున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. వ్యవసాయంలో నష్టపోకుండా రైతులను ఆదుకునేందుకు... రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా నగదు ఖాతాల్లో జమచేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికలు హామీలు చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మరే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎన్నికల హామీలు అమలు చేసిన చరిత్ర లేదంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.