వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే సమన్వయకర్తలను దాదాపుగా ప్రకటించేసిన వైసీపీ మార్చి 16వ తేదీన వైఎస్సార్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన రానుంది. ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే.. 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది. ఒకట్రెండు రోజుల్లో ఆఖరి జాబితా విడుదల కానుంది. ఈ ఇన్‌ఛార్జిలనే ఎన్నికల్లో దాదాపుగా అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఒకట్రెండు చోట్ల మార్పులు ఉంటే ఉండొచ్చని గతంలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి జాబితాతో ఎన్నికల్లో పోటీకి దించబోయే అభ్యర్థుల్ని దాదాపుగా ప్రకటించేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మార్చి 18వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెడతారని పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి అదేరోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్‌లో ఆయన ప్రచారంలో పాల్గొనచ్చని.. రోజుకు రెండు లేదంటే మూడు బహిరంగ సభలు, రోడ్ షోలలో సీఎం జగన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇక మేనిఫెస్టో విషయంలో కూడా అందరిలోనూ కాస్త క్యూరియాసిటీ ఉంది. ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఉంటాయోనని ఎదురు చూస్తూ ఉన్నారు.