CM Jagan : సీఎం జగన్ కాలికి గాయం.. ఒంటిమిట్ట పర్యటన రద్దు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఒంటిమిట్టపర్యటన రద్దైందిషెడ్యూల్ ప్రకారం నేడు కోదండరాముని దర్శించుకోవాల్సి ఉంది
By తోట వంశీ కుమార్ Published on 5 April 2023 9:32 AM ISTసీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దైంది. షెడ్యూల్ ప్రకారం నేడు(బుధవారం) సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని దర్శించుకోవాల్సి ఉంది. కోదండరాముడి కల్యాణం సందర్భంగా ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే.. మంగళవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తీవ్రత పెరిగింది. గతంలో ఇలానే కాలికి గాయం కావడంతో చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డారు ముఖ్యమంత్రి.
తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. దీంతో ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023
ఇదిలా ఉంటే.. ఒంటి మిట్ట శ్రీకోదండరామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం జరుగనుంది. ఈ మహోత్సవానికి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించారు.
ఒంటి మిట్ట కోదండ రామస్వామి సన్నిధిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా సీతారాముల కల్యాణం శ్రీరామ నవమి రోజు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజున పండు వెన్నెల వెలుగుల్లో జరగడం ప్రత్యేకత.