దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రజల తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై ఆలయ అర్చకులు సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మకు రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి తీర్ధ, ప్రసాదాలు, చిత్రపటం అందించారు. సీఎంతో పాటు ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కర్నాటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.