దక్షిణ కోస్తాంధ్రా జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు, పంటలకు నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తిరుపతి నగరంలోని కృష్ణానగర్‌ను సీఎం జగన్ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన సీఎం జగన్.. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలు, పశువులను కోల్పోయిన రైతులతో సీఎం జగన్ మాట్లాడారు. తాను అండగా ఉంటానని, అందరూ ధైర్యంగా ఉండాలని సీఎం జగన్ వరద బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం జగన్ చూశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ఇవాళ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం నాడు కడప జిల్లాలోని రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించారు. కూలిన వంతెనలను, వర్షాల ధాటికి ధ్వంసమైన ఇళ్లను సీఎం పరిశీలించారు. కాలినడకన గ్రామంలో తిరిగి వరద బాధితులతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని సీఎం చెప్పారు. వరద బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు.