దెబ్బ తిన్న ఇళ్లకు పది వేలు : సీఎం జగన్
మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat Published on 4 Dec 2023 3:15 PM GMTమిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, కలెక్టర్లకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని.. అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. క్యాంపుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధితులకు సదుపాయాలు కల్పించాలన్నారు. క్యాంపులకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికికైతే రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు బియ్యం సహా కూరగాయలు, సరకులు అందించాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు. తుపాను తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం ఇవ్వాలని సూచించారు.
రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని.. పంట కోయని చోట్ల అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్. ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని సీఎం జగన్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన మిచౌంగ్.. మంగళవారం ఉదయం బాపట్ల, దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకరించారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేసింది ఐఎండీ. కృష్ణపట్నంలో 8వ నెంబర్, మిగిలిన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.