క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు వెన‌క‌డుగు వేయ‌డం లేదు జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల‌కు శుభ‌వార్త ఇది. 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం'అమలుకు జగన్ సర్కారు సిద్ధమైంది. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

మగ్గం ఉండి.. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్నిఅందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చే రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది.

మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించారు. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాదయాత్రతో పాటూ నవరత్నాల్లో భాగంగా నేతన్నలకు చేయూత ఇస్తానని చెప్పిన హామీని సీఎం జ‌గ‌న్ నెర‌వేర్చారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story