మే 3న సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మే 3న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా

By అంజి  Published on  1 May 2023 2:45 AM GMT
CM Jagan, Vizag, Vizianagaram, APnews

 మే 3న సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటన 

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మే 3న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్, తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు మిగులు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు జగన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం విజయనగరం షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ రావివలస గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు జీఎంఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వెళ్తారు. 10.30 గంటలకు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన, తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు మిగులు పనులను సీఎం ప్రారంభిస్తారు.

ఉదయం 10.55 గంటలకు సీఎం జగన్.. సవరవిల్లి బహిరంగ సభా వేదిక వద్దకు హాజరు కానున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖకు బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నంబర్ 3లోని హెలిప్యాడ్‌ దగ్గర దిగుతారు. సీఎం రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్‌లోని వేదిక వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల మధ్య వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 3.50 గంటలకు జగన్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరి విశాఖ ఎంపీ, రుషికొండలోని సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల పెళ్లయిన ఎంపీ కుమారుడు, ఆయన భార్యను ఆశీర్వదించనున్నారు. ఆ సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి సయంత్రం 5.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖపట్నంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

Next Story