నేను ఏ రోజూ కుప్పంను తిట్టలేదు : సీఎం జగన్
చంద్రబాబు నాయుడుకు నాపై కోపం వస్తే కడపను, పులివెందులను తిడతాడు.. ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు
By Medi Samrat
చంద్రబాబు నాయుడుకు నాపై కోపం వస్తే కడపను, పులివెందులను తిడతాడు.. ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కానీ నేను ఏనాడూ కుప్పంను పల్లెత్తు మాట అనలేదు.. కుప్పం నియోజకవర్గాన్ని కానీ, ఇక్కడి ప్రజలను కూడా ఒక్క మాట అనలేదన్నారు సీఎం జగన్. కుప్పం నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నానని శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను 14 ఏళ్లు పాలించానంటాడు.. ఏం చేశాడంటే పెద్ద సున్నా అని సమాధానం వస్తుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోసం చేయడానికి తయారవుతాడని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని, కుప్పం ప్రజలు భరత్ ను ఆశీర్వదించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని అన్నారు. కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని స్పష్టం చేశారు. పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా... లేక ఎన్నికలప్పుడు ప్రజలను వాడుకునే చంద్రబాబు మార్కు రాజకీయం కావాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందా? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి జరిగిందా? కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చింది మీ జగన్... కుప్పంను మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్ అని అన్నారు. కుప్పంకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది మీ జగన్.. చిత్తూరు పాలడెయిరీని పునఃప్రారంభించింది మీ జగన్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరారు సీఎం జగన్.