వైఎస్ వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో అందరికీ తెలుసు: సీఎం జగన్
ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat
ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు సీఎం జగన్. ఆయనను హత్య చేసిన హంతకులు మన కళ్ల ముందే తిరుగుతూ ఉన్నారని తెలిపారు సీఎం జగన్. అలాంటి వారి చెంతకు తమ ఇంట్లో వాళ్లు కూడా వెళ్లడం చాలా బాధగా ఉందని అన్నారు. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కూడా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తికి మద్దతుగా ఉన్నారంటూ సీఎం జగన్ ఆరోపణలు గుప్పించారు. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారన్నారని అన్నారు సీఎం జగన్. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు.. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. చంపిన హంతకులు బహిరంగంగా తిరుగుతున్నారు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు.. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా అన్నారు సీఎం జగన్.
రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని.. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకేపరిమితమవుతుందని సీఎం జగన్ అన్నారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షే పథకాల రూపంలో పంచామని.. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ అన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు.