ఉపాధ్యాయుల సేవలను భోదనేతర కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను భోదనేతర కార్యక్రమాలకు వాడుకోవడం వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న ఉపాధ్యాయులు ఉన్నారని.. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు పెట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాల్లో నాడు-నేడు సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు. మార్చి 15 నుంచి నాడు-నేడు రెండో విడుత పనులు మొదలుపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక అందిచాలన్నారు. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? చూడాలన్నారు. తల్లిదండ్రులు కడుతున్న ఫీజులకు తగ్గట్లు పిల్లలకు సౌకర్యాలు, వసతులు అందిస్తున్నారో లేదో క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు.