వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. ఆ కుటుంబాలకు రూ.2వేలు ఇవ్వాలని ఆదేశం
CM Jagan Review Meeting on Floods and Heavy Rains.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. గోదావరి ఉద్దృతి, వరద సహాయక చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ సంవత్సరం గోదావరికి ముందుగానే వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జూలై నెలలో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందన్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని, బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. గోదావరిలో వరద 16లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని, దీని వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.
కంట్రోల్ రూమ్స్ అన్ని సమర్థవంతంగా పని చేయాలన్నారు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు. అవసరం అయిన చోట వరద సహాయక శిబిరాలు తెరవాలన్నారు. సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లే బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, కరెంట్ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.