'వైఎస్ఆర్ లా నేస్తం' నిధుల విడుదల చేసిన సీఎం జగన్

వైఎస్సార్ లా నేస్తం పథకం నిధులను సీఎం జగన్ ఈ రోజు బటన్‌ నొక్కి జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో జమచేశారు.

By అంజి  Published on  22 Feb 2023 10:24 AM GMT
CM YS Jagan, YSR Law Nestam, junior lawyers

'వైఎస్ఆర్ లా నేస్తం' నిధుల విడుదల చేసిన సీఎం

అమరావతి: రాష్ట్రంలో యువ న్యాయ‌వాదుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. యువ న్యాయ‌వాదుల‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. వైఎస్సార్ లా నేస్తం పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బటన్‌ నొక్కి జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో జమచేశారు. ఈ పథకం కింద తాజాగా కోటి 55 వేల రూపాయ‌లు జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో జమ అయ్యాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్‌ న్యాయవాదులను ఆదుకునేందుకు వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత మూడేళ్ళుగా వైఎస్సార్ లా నేస్తం పథకం కింద నాలుగు వేల 248 మంది యువ న్యాయవాదులకు నెలనెల ఆర్ధిక సాయమందిస్తున్నామని వివరించారు. యువ న్యాయవాదులను మరింత ప్రోత్సహించేందుకు వీలుగా వంద కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇక నుంచి వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ఏడాదికి రెండు సార్లు అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. న్యాయవాద డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్ కోసం నమోదు చేసుకున్న జూనియర్ న్యాయవాదులకు ఈ మొత్తాన్ని స్టైఫండ్‌గా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు జూనియర్ న్యాయవాదులకు వైఎస్ఆర్ లా నేస్తం కింద రూ.35.40 కోట్లు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. జూనియర్ అడ్వకేట్‌లు స్వయం ఉపాధి సంఘాలకు చెందిన వారు కావడంతో మొదటి మూడు సంవత్సరాల ప్రాక్టీస్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పథకం కింద ఒక్కొక్కరికి మూడు సంవత్సరాలకు నెలవారీగా రూ. 5000 అందజేస్తే వారు తమంతట తాముగా నిలబడేందుకు ఎంతో దోహదపడుతుందని సీఎం అన్నారు.

జగన్ ప్రజా సంకల్ప యాత్రలో జూనియర్ న్యాయవాదులు తమ కష్టాలను వివరించి ఆర్థికంగా ఆదుకునేందుకు పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వైఎస్ఆర్ లా నేస్తం ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ లా నేస్తం లేదా అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కింద ఆర్థిక సహాయం కోరే ఔత్సాహిక జూనియర్ న్యాయవాదులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నేరుగా తమ అభ్యర్థనలను న్యాయ కార్యదర్శికి పంపవచ్చని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి కొంతమంది లబ్ధిదారులతో వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. వారి కెరీర్‌లో మంచి జరగాలని ఆకాంక్షించారు.

Next Story