జగనన్న స్మార్ట్ టౌన్షిప్వెబ్సైట్ ప్రారంభం.. మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు
CM Jagan launched Jagananna Smart Township website today.జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2022 7:58 AM GMTజగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామన్నారు. రియల్ ఎస్టేల్ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని.. ఇప్పటికే 30లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
తొలి దశలో 15.60లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని చెప్పారు. సంక్రాంతి పండుగ వేళ దీనికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఇక మూడు కేటగిరీల్లో స్థలాల పంపిణీ ఉంటుందన్నారు. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాలు అందిస్తామన్నారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరులోనూ, వైయస్సార్‌జిల్లా రాయచోటిలోనూ, ఒంగోలు జిల్లా కందుకూరులోనూ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ లే అవుట్లు వేస్తున్నట్టు చెప్పారు.
ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని నియోజవర్గాల్లో ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. 18 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న వారు జగనన్న టౌన్స్‌లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లింపులు చేయవచ్చునన్నారు. చెల్లింపులు పూర్తికాగానే డెవలప్ చేసిన ప్లాట్‌ను చేతికి అందిస్తామని.. ప్లాట్ల నిర్ణీత విలువలో మొదట 10శాతం చెల్లించాలని, అగ్రిమెంట్ చేసుకున్నతర్వాత 30 శాతం, ఆరు నెలల్లోపు 30శాతం, మిగతాది 12 నెలల్లోగా లేదా రిజిస్ట్రేషన్ తేదీలోగా చెల్లించాలని సీఎం జగన్ తెలిపారు.