తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన తీరును తప్పుపట్టారు. బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. ఈ నెల 25 వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గవర్నర్ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు. వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదు. గతంలో ఎన్నడూ ఇలా జరిగలేదని అన్నారు.
సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. సభలో గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే.. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్..గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా ఏపీ బడ్జెట్ ప్రతులను చించివేశారు. అనంతరం సభ వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.