భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
CM Jagan expresses shock on Bhakarapet bus accident.చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో
By తోట వంశీ కుమార్
చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు దుర్మరణం చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు కోలుకునేంత వరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
బాధితులకు పెద్ది రెడ్డి పరామర్శ
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జెడ్పీ పంచాయితీ ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణకి చర్యలు చేపడుతామన్నారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే రూ.1500 కోట్లతో నాలుగు వరుసల రహదారి మంజూరైందని తెలిపారు.
చంద్రాబాబు నాయుడు దిగ్భ్రాంతి
బస్సు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ప్రమాదం పెళ్లింట్లో విషాదాన్ని నింపిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రమాద ఘటన కలచివేసిందన్న పవన్
భాకరాపేట బస్సు ప్రమాద ఘటన కలచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఆ సమయంలో సహాయం అందక క్షతగాత్రులు ఎంత వేదన అనుభవించారో ఊహిస్తేనే గుండె భారంగా మారుతోందన్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారన్నారు. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టాలన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.