CM Jagan : సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్
గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 12:05 PM IST
సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి(గురువారం) సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. మార్చి 17(శుక్రవారం) ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, విభజన హామీల అమలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని, హోం మంత్రి భేటీ నేపథ్యంలో సీఎం జగన్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 7.15 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నివాసానికి వెళ్లి అక్కడే బస చేయనున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సీఎం జగన్.. బడ్డెట్ ప్రసంగం పూర్తి అయిన తరువాత క్యాంపు ఆఫీసులో ఢిల్లీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు, అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావడం, విభజన హామీల అమలులో కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడం, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.