ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ.. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదన్నారు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, మన ప్రజల గెలుపును ఎవ్వరూ ఆపలేరని సీఎం జగన్ అన్నారు. ఇటువంటి దాడులతో తన సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదన్నారు. ఈస్థాయికి దిగజారారు అంటే విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, విజయానికి వారు అంత దూరంగా ఉన్నారని అర్థమని తెలిపారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడని తేల్చి చెప్పారు సీఎం జగన్. నా నుదుటిపై వారు చేసిన గాయం కణతకు తగల్లేదు, కంటికి తగల్లేదు. మీ బిడ్డ విషయంలో దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని దానర్థమని అన్నారు. నా నుదుటి మీద చేసిన గాయం మరో 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ... గతంలో చంద్రబాబు రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, వివిధ సామాజిక వర్గాలకు చేసిన గాయాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరన్నారు.
ఇప్పటివరకు ప్రజా సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కామని.. మే 13న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం కోసం మీరు ఫ్యాన్ మీద రెండు బటన్లు నొక్కండని పిలుపునిచ్చారు సీఎం జగన్. పేదలకు ఏ మంచి చేయొద్దు అనేదే చంద్రబాబు ఫిలాసఫీ అని అన్నారు. పేదలకు మంచి చేయకూడదన్నది మాత్రమే తెలిసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తెలిసింది కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమని విమర్శలు గుప్పించారు.