సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాంలో కొత్త అధ్యాయానికి నాంది పలకడం విద్యారంగంలో రాష్ట్రానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్ లో నిర్వహించిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
దేశంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్ట్ ద్వారా విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇచ్చామని, మైక్రోసాఫ్ట్ ద్వారా 35,980 మంది విద్యార్థులు శిక్షణ పొందారని సీఎం జగన్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందించిన ఆయన.. సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు.
ఇప్పటివరకు 40 డిపార్ట్‌మెంటల్ కోర్సుల్లో సుమారు 1.62 లక్షల మందికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చామన్నారు. విద్యార్థులపై భారం పడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేసిందని, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఈ ఆధునిక ప్రపంచంలో పోటీపడేలా తీర్చిదిద్దామని సీఎం జగన్ పేర్కొన్నారు.
పిల్లలు జీవితంలో ఎదగాలంటే చదువులు అవసరమన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు.