నారావారిపల్లె కు సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులు అక్క‌డే..

సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు.

By -  Medi Samrat
Published on : 12 Jan 2026 6:27 PM IST

నారావారిపల్లె కు సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులు అక్క‌డే..

సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు.. ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకున్నారు. సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మంగళవారం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.

ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు

మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

నాగాలమ్మకు ప్రత్యేక పూజలు

15వ తేదీన తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.

Next Story