అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్ధికపరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ. 6,700 కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
జీపీఎఫ్‌కు రూ.519 కోట్లు, సీపీఎస్‌కు రూ.300 కోట్లు, టీడీఎస్‌కు రూ.265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241 కోట్లు ,ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.788 కోట్లు, 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు, 651 కంపెనీలకు రూ.90 కోట్ల రాయితీ, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
''ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నా కూడా వారికి మేలు చేయాలనేదే ఈ ప్రయత్నం. నిధుల విడుదలకు నేడు తీసుకున్న ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లల్లో సంతోషాన్ని తెస్తుంది. పండుగ పూట వారి ఆనందం మాకు అత్యంత సంతృప్తినిస్తుంది. ప్రతి వర్గానికి మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తామని, ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తామని తెలుపుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు'' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.