ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

సీఎం చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని వచ్చే నెల 1వ తేదీ నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on  17 Oct 2024 6:38 AM IST
CM Chandrababu, AP government, road repairs

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు 

అమరావతి: సీఎం చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని వచ్చే నెల 1వ తేదీ నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలు ఉండకూడదన్నారు. ఆర్‌ అండ్‌ బీ పరిధిలోని రోడ్లలో గుంతలు పూడ్చడానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. అవసరం పడి మరో 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. రోడ్ల పరిస్థితిపై డ్రోన్లతో సర్వే చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.55 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని, మరో రూ.30 వేల కోట్లతోనూ రోడ్ల నిర్మాణానికి పర్మిషన్‌ వస్తుందని చంద్రబాబు తెలిపారు.

నిన్న నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, మరమ్మతులపై చర్చించారు. వైసీపీ హయాంలో గ్రామీణ రహదారుల మరమ్మతులకు గిడ్డంగుల సంస్థ ద్వారా రుణం సమీకరణ చేశారని అధికారులు కేబినెట్‌ దృష్టికి తెచ్చారు. ఆర్థిక శాఖలో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ లేకుండా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు జీవో విడుదల చేశారని తెలిపారు. గిడ్డంగుల సంస్థలో సగం వాటా కేంద్రానిదని, ఆ రుణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. అప్పట్లో టెండర్లు పిలిచి అప్పగించిన పనుల్లో 20 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్థిక శాఖలో ఖాతా లేకుండానే బిల్లులు ఇచ్చేశారని, దీనిపై విచారణకు కమిటీ వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

Next Story