ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీపావళి పండగ నుంచి ఈ స్కీమ్‌ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాలా శాఖ కార్యాచరణ రెడీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు దారులకు ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తే ఏడాదికి రూ.3,640 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.
దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1763 కోట్లు అవసరం కానుంది. ఈ పథకంకు ఎంత ఖర్చవుతుంది, ఎలా అమలు చేయాలి అనే వివరాలతో పౌరసరఫరాల శాఖ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై సిఫారసులు చేయనుంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపితే విధివిధానాలు వెలువడనున్నాయి. ఎన్నికల సమయంలో ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ విధంగా చూస్తే ఏడాదికి రూ.2,476 ల ప్రయోజనం చేకూరనుంది.