రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By - Knakam Karthik |
రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణాన్ని పరిశీలిస్తూ, ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని వివరించడానికి ఈ పర్యటన కీలకంగా మారనుంది.
పర్యటన షెడ్యూల్ ఇలా..
రేపు ఉదయం 7.30 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్తారు. ఉదయం 10.15 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు దుబాయ్ చేరుకుంటారు.
చంద్రబాబు పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, వచ్చే నెల విశాఖపట్నంలో జరగనున్న CII గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ హబ్బులు స్థాపించేందుకు అవకాశాలు అన్వేషించనున్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పోర్టులు, రోడ్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.