నేడు మహిళా పథకాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు.
By అంజి
నేడు మహిళా పథకాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు. ఉండవల్లి నుంచి ఉదయం 10.45 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం స్టాళ్ల ప్రదర్శన, లబ్ధిదారులకు పథకాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జిల్లా నేతలు, అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.42 గంటలకు తిరిగి ఉండవల్లి చేరుకుంటారు.
ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. కేటలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌తో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడంపై కేటలిస్టు మేనేజ్‌మెంట్ సర్వీసెస్ దోహద పడుతుంది.
చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కేఫ్‌తో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనిద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభించనుంది. మెప్మా, హోంట్రయాంగిల్‌తో ఒప్పందం ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధి అవకాశాలను పెంపొందించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18,515 మహిళా సర్వీసు ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సర్వీసు ప్రొవైడర్లలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతు నిపుణులు ఉంటారు. రాపిడో సంస్థతో మెప్మా అవగాహన ఒప్పందం ద్వారా వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రకాశం జిల్లా నుంచి 10 ఈ-బైక్‌లు, 10 ఈ-ఆటోలు లబ్ధిదారులకు కేటాయించారు. ఆన్‌బోర్డింగ్, నెలవారీ చార్జీలను 3 పాటు మాఫీ చేస్తుంది. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా వెయ్యి మంది మహిళలకు రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. మహిళా సంఘాల ద్వారా అరకు కాఫీ ప్రమోషన్‌కు 100 ఔట్‌లెట్‌లు, 100 కాఫీ హోటళ్లు ఏర్పాటు చేస్తారు.
''అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు నా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు. ఇది సమాజ బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే'' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ. 4,332 కోట్లు కేటాయించడం ద్వారా మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ''అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం. మీ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ... మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను'' అని సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టులో తెలిపారు.