2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్‌సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
By Knakam Karthik
2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్‌సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లా నారంపేటలో వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పెద్దఎత్తున రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా.... ఇంటికో ఎంట్రపెన్యూర్‌ని తయారు చేసేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పన మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్మికుల పండుగ రోజైన మే డే నాడు కార్మికులకు ఈ కానుక అందించనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నారంపేటలో గురువారం జరిగే కార్యక్రమంలో ఇందుకు శ్రీకారం చుడుతున్నారు. ఒకే రోజు 11 MSME పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూర్, దర్శి, పుట్టపర్తిలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభం కానున్నాయి. అలాగే యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలోని ఎఫ్ఎఫ్‌సీని కూడా వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మొత్తం 909 ఎకరాల్లో వచ్చే ఈ 11 ప్రాజెక్టులకు రూ.199 కోట్లు ఖర్చు కానుంది. ఆత్మకూరు మండలం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది.
2028 కల్లా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు
మరో 14 ఎఫ్ఎఫ్‌సీ(ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్)లు, 25 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. మొత్తం 546 ఎకరాల్లో ఏర్పాటు చేసే 14 ఎఫ్ఎఫ్‌సిలకు రూ.359 కోట్లు వ్యయం కానుంది. అలాగే 1,455 ఎకరాల్లో ఏర్పాటు చేసే 25 కొత్త MSME పార్కులకు రూ.559 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 40 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలనేది టార్గెట్. 2028కి అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కులను ఏర్పాటు చేసి ఉపాధి మార్గాలను విస్తృతం చేయాలనేది ముఖ్యమంత్రి ఆశయం. MSMEలు రాష్ట్ర అభివృద్ధికి కీలక స్తంభాలు... వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం MSMEలకే ఉంది. అందుకే MSMEల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ప్రాధాన్యత ఇస్తోంది.