అమరావతి: కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఓట్లేసి గెలిపించినందుకు.. తమ ఎమ్మెల్యే శాసనసభలో ఏం మాట్లాడుతున్నారోనని నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే బయట ఇసుక, మద్యం, వంటి వ్యవహారాల్లోనూ, ప్రైవేట్ పంచాయతీల్లోనూ వేలు పెట్టొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించరని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇదేనని పేర్కొన్నారు. మంగళవారం నాడు అసెంబ్లీలో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని, ఏవైనా కొత్త ఆలోచనలు ఉంటే సభలో పంచుకోవాలని సూచించారు. తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. శాసనసభ్యులు హుందాగా వ్యవహరించాలని, ఎలాంటి ఆరోపణలూ రావడానికి వీలు లేదని చెప్పారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు అయ్యేలా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తుంటానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా పరుగెత్తిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కుకు ఎమ్మెల్యేలే చైర్మన్లుగా ఉంటారని, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత కూడా వారే తీసుకోవాలని సూచించారు.