అమరావతి: సూపర్ 6 పథకాల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి పండుగ రోజు నుండి అమలు చేసి అందరి ఇళ్లలో దీపం వెలిగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే వంద రోజుల ప్రణాళికలో అనేక కార్యక్రమాలు చేపట్టి లక్ష్యాలు సాధించామని సీఎం తెలిపారు.
''పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 1వ తేదీనే 98 శాతం మంది లబ్దిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో పింఛన్లు పెంచి అందజేస్తున్నాం. 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో పింఛన్లు అందించిన సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12508 కోట్లు ఖర్చు చేసింది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను'' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.