వారి వల్ల నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలి?: సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 17 Aug 2025 9:15 PM IST

Andrapradesh, Cm Chandrababu, Tdp, Welfare Schemes

వారి వల్ల నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలి?: సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకంపై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలపై సమీక్షించారు. ఉచిత బస్సు పై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తోందని పార్టీ విభాగాలు చంద్రబాబుకు వివరించాయి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ తో వైసీపీ అంతర్మథనంలో పడిందని.. దీంతో తప్పుడు ప్రచారాలకు దిగుతోందని వివరించారు. ఉచిత బస్సు పై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ, అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతలకు సీఎం సూచనలు చేశారు. పథకాల అమల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా భాగస్వాములు అయ్యేలా చూడాలని పార్టీ యంత్రంగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకం అవ్వడం ద్వారానే పథకాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంగా ఎమ్మెల్యేలు కేంద్రంగా తలెత్తిన పలు వివాదాలపై, ఘటనలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే విధంగా అనంతరపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకే నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని అనంతపురం ఘటనపై సీఎం వ్యాఖ్యానించారు. చిన్న విమర్శకు ఆస్కారం ఇచ్చేలా కూడా పార్టీ ఎమ్మెల్యేలు నేతల వ్యవహారం ఉండకూడదని సీఎం సూచించారు. ఆయా ఘటనల్లో తప్పు లేకపోయినా, తప్పుడు ప్రచారం జరుగుతున్నా నేతలు వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయన్నారు. ఎమ్మెల్యేలు, నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలన్నారు. ఈ మూడు ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి సీఎం చంద్రబాబు నివేదిక కోరినట్లు సమాచారం.

Next Story