తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

By -  Knakam Karthik
Published on : 5 Oct 2025 4:23 PM IST

Andrapradesh, Srishailam, CM Chandrababu, Srisailam Temple, Endowment

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి: శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్దిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు.

తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని, దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా...ఆలయ సమగ్రాభివృద్దికి సత్వర చర్యలు అవసరం అని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ది చేద్దాం..అని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Next Story