అగ్నిప్రమాద బాధితులకు రూ.25 వేల తక్షణ సాయం..సీఎం చంద్రబాబు ఆదేశాలు

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు.

By -  Knakam Karthik
Published on : 13 Jan 2026 11:10 AM IST

Andrapradesh, Kakinada, Sarlankapalle fire incident, CM Chandrababu

అగ్నిప్రమాద బాధితులకు రూ.25 వేల తక్షణ సాయం..సీఎం చంద్రబాబు ఆదేశం

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ ప్రమాదంలో 38 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమవడం పెను విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్లు కోల్పోయిన 38 కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, బాధితులకు శాశ్వత పరిష్కారంగా కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వారికి అవసరమైన వసతి, ఆహారం అందించి అండగా నిలవాలని సూచించారు.

అగ్నిప్రమాదంలో కాలిపోయిన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను తిరిగి జారీ చేసేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. బాధితులకు అందుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో పాటు మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story